నేటి నుంచి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో మహాజన పాదయాత్ర మొదలవుతుంది. ఈ మహాజన పాదయాత్ర ఏకధాటిగా 5 నెలలపాటు సుమారు 4,000 కిమీలు ఈ యాత్ర సాగుతుంది. రాష్ట్రంలో 31 జిల్లాల గుండా ఈ యాత్ర సాగి మార్చి 12వ తేదీన హైదరాబాద్ లో ముగుస్తుంది. తెలంగాణా ఏర్పడితే ప్రజల బతుకులు మారుతాయని ఆశిస్తే, తెరాస సర్కార్ రెండేళ్ళ పాలనలో ఎటువంటి మార్పులేకపోగా ఇంకా అధ్వానంగా మారిందని సిపిఎం ఆరోపిస్తోంది. కనుక రాష్ట్రంలో తెరాసకి ప్రత్యమ్నాయంగా సిపిఎం పార్టీని బలోపేతం చేసుకొనేందుకే ఈ మహాజన పాదయాత్ర చేపడుతున్నట్లు తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ పార్టీ నాయకుల, కార్యకర్తలలో ఈ యాత్రతో నూతనోతేజం నింపేందుకు దోహదపడుతుందని భావిస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు.
ఈ యాత్రలో భాగంగా రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు, నిర్వహించబోతున్నారు. ఐదు నెలల పాటు సుదీర్గంగా సాగే ఈ పాదయాత్రని విజయవంతంగా నిర్వహించేందుకు ఎక్కడికక్కడ అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు సిపిఎం 18 కమిటీలని ఏర్పాటుచేసుకొంది. ఈ మహాజన పాదయాత్రలో నిర్వహించబోయే బహిరంగ సభలలో సిపిఎం జాతీయ నాయకులు కూడా పాలనే అవకాశం ఉంది. రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బహిరంగ సభతో ఈ మహా జనపాదయాత్ర మొదలుపెట్టబోతున్నారు.