రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒకపక్క కొత్త జిల్లాల ఏర్పాటుని స్వాగతిస్తున్నామని చెపుతూనే మరోపక్క జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుగలేదని సన్నాయి రాగాలు తీస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడిన కారణంగా అధికార తెరాసతో సహా రాష్ట్రంలో అన్ని పార్టీలలో కొత్తగా చాలా మందికి పదవులు దక్కుతున్నందుకు అందరూ చాలా సంతోషిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుని విమర్శిస్తున్న కాంగ్రెస్, తెదేపాలు రెండూ ఇప్పటికే కొత్త జిల్లాలకి కమిటీలని, అధ్యక్షుల నియామక ప్రక్రియని పూర్తి చేస్తున్నాయి. జిల్లాల పునర్విభజన చాలా అశాస్త్రీయంగా ఉందని వాదిస్తున్న సిపిఎం కూడా కొత్తగా ఏర్పడిన అన్ని జిల్లాలకి కార్యదర్శులని, కమిటీలని నియమించుకొంది. హైదరాబాద్ కి ఇద్దరు కార్యదర్శులు, రెండు కమిటీలు ఏర్పాటు చేసుకొంది. వారందరూ ఈరోజు సంగారెడ్డిలో సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్, తెదేపాలు కూడా జిల్లా స్థాయి అధ్యక్షులు, కమిటీలతో సమావేశాలు నిర్వహించడానికి సిద్దం అవుతున్నాయి.
ఎన్నికలలో ఓడిపోయి చేతిలో ఎటువంటి పదవి, అధికారం లేక చాలా బాధపడుతున్న ప్రతిపక్షాల నేతలకి, ఈవిధంగానైన పార్టీలో పదవులు దక్కినందుకు సంతోషించకుండా ఉండరు కదా? తన కోరికని మన్నించి గద్వాల్ జిల్లాని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞతలు చెప్పుకొంటే మిగిలినవారు బహుశః మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారేమో? ఈ కొత్త జిల్లాలకి అమరికకి అన్ని పార్టీలు అలవాటుపడితే ఇక అప్పుడు అంతా శాస్త్రీయంగానే కనబడవచ్చు.