ఈరోజు వరంగల్ లోని ఎనుమామూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన మంత్రి హరీష్ రావు ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘తెలంగాణాలో ప్రాజెక్టులని ఆపాలని ఏపి సిఎం చంద్రబాబు చాలా కుట్రలు చేస్తుంటారు. పాలమూరు, డిండి, ప్రాజెక్టులని కట్టకూడదని ఆయన అపెక్స్ కమిటీ సమావేశంలో గట్టిగా వాదించారు. తెలంగాణా ప్రాజెక్టులకి వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేయిస్తుంటారు. అక్కడ ఆయన ప్రాజెక్టులని అడ్డుకొనేందుకు కుట్రలు చేస్తుంటే, ఇక్కడ తెదేపా నేతలు ప్రాజెక్టులు కట్టాలని మాట్లాడుతుంటారు. వారిలో మనం ఎవరి మాట నమ్మాలి? చంద్రబాబునా లేకపోతే తెలంగాణా తెదేపా నేతల మాటలనా? తెదేపా నేతలు నిజంగా తెలంగాణా బిడ్డలే అయితే, వారికి తెలంగాణా రాష్ట్రం, ప్రజల పట్ల నిజంగా ప్రేమే ఉన్నట్లయితే మొదట తమ అధినేత చంద్రబాబు కేంద్రానికి చేస్తున్న పిర్యాదులని అడ్డుకోవాలి. ఆయన ఇచ్చిన లేఖలని, కోర్టులో వేసిన పిటిషన్లని ఉపసంహరింపజేయించాలి. తమ నాయకుడు తెలంగాణా ప్రాజెక్టులు అడ్డుకొంటున్నందుకు వారు ప్రజలకి క్షమాపణలు చెప్పాలి,” అని హరీష్ రావు కోరారు.
రైతుల సమస్యలపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలకి కూడా హరీష్ రావు కూడా చురకలు వేశారు. కాంగ్రెస్ హయంలో రైతులకి విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా వారు అన్ని పనులు మానుకొని పోలీస్ స్టేషన్ల మధ్య క్యూలు కట్టలసివచ్చేదని కానీ ఇప్పుడు రైతులకి ఎటువంటి కష్టమూ, కోరతా లేకుండా వారికి కావలసినవన్నీ వారి దగ్గరకే వస్తున్నాయని హరీష్ రావు అన్నారు. రైతులకి అవసరమైన విత్తనాలని, ఎరువులని ప్రభుత్వం చాలా ముందు నుంచే సిద్దం చేసి ఉంచినందునే అది సాధ్యం అయ్యిందని అన్నారు. తమ హయాంలో రైతులని అష్టకష్టాలు పెట్టిన తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు రైతుల సమస్యల కోసం పోరాటాలు చేస్తామని బయలుదేరడం చాలా హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు అన్నారు.