
హైదరాబాద్ లో మందుల తయారీ సంస్థలు (ఫార్మా) చాలా కాలంగానే ఉన్నాయి...మంచి అభివృద్ధి సాధిస్తున్నాయి కూడా. ఆ కారణంగా దక్షిణాది రాష్ట్రాలలో హైదరాబాద్ ఫార్మా పరిశ్రమకి ప్రధాన కేంద్రంగా ఎదుగుతోంది. తెరాస సర్కార్ కూడా ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి మరింత కృషి చేస్తోంది.
ఆ ప్రయత్నంలోనే రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ అక్కడి ఫార్మా దిగ్గజాలని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించి ప్రముఖ ఫార్మా సంస్థలు మెర్క్, జాన్సన్ అండ్ జాన్సన్ రాష్ట్రంలో తమ సంస్థలని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. అందుకోసమ నిన్న ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేశాయి.
వాటిలో మెర్క్ సంస్థ సి.ఈ.ఓ. సనత్ చటోపాద్యాయ రాష్ట్రంలో వాక్సిన్ తయారీలో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో స్థానిక సంస్థలతో కలిసి ‘వాక్సిన్ ఎక్సలెన్స్ సెంటర్’ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆయన నవంబరులో హైదరాబాద్ లో పర్యటించడానికి వస్తానని హామీ ఇచ్చారు.
ప్రపంచ ప్రసిద్దమైన జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కూడా రాష్ట్రంలో తమ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ఆ సంస్థ కూడా నిన్న ఒప్పంద పత్రంపై సంతకాలు చేసింది. ఆ సంస్థ ఫార్మా విభాగం చైర్మన్ పాల్ స్టోఫెల్ తో నిన్న మంత్రి కెటిఆర్ సమావేశమైనప్పుడు, రాష్ట్రంలో స్థిరంగా అభివృద్ధి చెందుతున్న ఫార్మా రంగం, దాని వ్యాపార అవకాశాలు, ఫార్మా రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించారు. ఆ వివరణతో సంతృప్తి చెందిన పాల్ స్టోఫెల్ రాష్ట్రంలో తమ సంస్థ ఏర్పాటు చేయదానికి అంగీకరించడమే కాకుండా వచ్చే ఏడాది హైదరాబాద్ లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రాష్ట్రంలో టిబి నివారణకి, మెర్క్ సంస్థ డయోరియా నివారణ కోసం ప్రభుత్వానికి అన్ని విధాల సహాయసహకారాలు అందించడానికి అంగీకరించాయి.