కాంగ్రెస్ గెలుపు 50శాతమేనా?

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా 50 శాతం సీట్లు తప్పకుండా గెలుస్తామని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ నమ్మకం వ్యక్తం చేశారు. సాధారణంగా ఏ రాజకీయ నేత అయినా తమ పార్టీయే పూర్తి మెజారిటీ సాధిస్తుందని చెప్పుకొంటాడు. కానీ షబ్బీర్ అలీ తమ కాంగ్రెస్ పార్టీ కేవలం 50 శాతం సీట్లు మాత్రమే సాధిస్తుందని చెప్పుకోవడం విశేషం. 50 శాతం సీట్లు మాత్రమే సాధిస్తామని చెప్పుకొంటూనే మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెరాస పార్టీ ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పడం విశేషం. ఈ విషయంలో తెరాస ఎప్పుడూ 80-90శాతానికి తక్కువ చెప్పుకోదు. కాంగ్రెస్ పార్టీకి తెరాసకి అదే తేడా. 

ఈ విషయంలో షబ్బీర్ అలీ కొంచెం తప్పటడుగు వేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం, ఖర్చుల గురించి చాలా ఆలోచించదగ్గ ప్రశ్నే వేశారు. తెలంగాణా ధనిక రాష్ట్రమని చెపుతున్నప్పుడు, కేంద్రప్రభుత్వం నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు అందుతున్నప్పుడు, విద్యార్ధులకి ఫీజ్ రీఎంబర్స్ మెంట్, రైతుల రుణమాఫీ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు.

తెలంగాణా ధనిక రాష్ట్రమని చెపుతూ గొప్ప గొప్ప పధకాలు ప్రకటించడమే తప్ప వాటిని ఆచరించడం లేదని విమర్శించారు. పాత హామీలని నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ రోజు కొత్త వాగ్దానాలు చేస్తున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. 

కాంగ్రెస్ హయంలో కేవలం 4 శాతమే మైనార్టీలకి  రిజర్వేషన్లు ఇచ్చినప్పటికీ సుమారు 10 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని, కానీ కెసిఆర్ దానిని ఏకంగా 12 శాతం పెంచుతానని ఎన్నికలలో హామీ ఇచ్చి ఆ హామీని కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేకపోవడమే కాకుండా కనీసం ఆ 4 శాతం రిజర్వేషన్లతో ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. 

తెరాస సర్కార్ ప్రకటించిన షాదీ ముబారక్ పధకానికి సుమారు 7,000 దరఖాస్తులు వస్తే ఇంతవరకు ఒక్క దానికి కూడా నిధులు విడుదల చేయలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ని విమర్శించారు. తెలంగాణా ధనిక రాష్ట్రమని చెపుతున్నప్పుడు ఈ చెల్లింపులు ఎందుకు చేయలేకపోతున్నారని కెసిఆర్ ని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులన్నీ ఏమైపోతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయ, వ్యయాలని తెలియజేస్తూ ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.