ముఖ్యమంత్రి కెసిఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి తెరాసలోని ముస్లిం నేతలు ఆయనని ఫాంహౌసులో మొన్న కలిసినప్పుడు, ఆయన వారికీ, రాష్ట్రంలో ముస్లిం ప్రజలకి కూడా అనేక వరాలు ప్రకటించారు. పార్టీలోని ముస్లిం నేతలలో ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తానని ప్రకటించారు. తెరాస స్థాపించినప్పటి నుంచి పార్టీకి నిస్వార్ధంగా సేవచేస్తున్న ఖమ్మం జిల్లా తెరాస అధ్యక్షుడు షేక్ బుర్హాన్ కి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. ఒక్కో కార్పోరేషన్ లో ముగ్గురు ముస్లిం నేతలకి డైరెక్టర్ పదవులు ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర హజ్ కమిటీ, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్, ఉర్దూ అకాడమీమొదలైన సంస్థలలో పోస్తులని భర్తీ చేస్తామని చెప్పారు. రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ షఫీక్ ఉజ్ జమాని మైనార్టీ వ్యవహారాల కోసం ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొంటామని చెప్పారు.
ఇవికాక రాష్ట్రంలో ముస్లిం ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమం రూ.1200 కోట్లు కేటాయించామని, దానిని వచ్చే బడ్జెట్ లో రూ.1500 కోట్లకి పెంచుతానని ప్రకటించారు. రాష్ట్రంలో పేద ముస్లిం విద్యార్ధుల కోసం వచ్చే ఏడాదిలో కొత్తగా 89 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వచ్చే నాలుగేళ్ళ వ్యవధిలో మరో 400 స్కూళ్ళు స్థాపించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మైనార్టీ విద్యాసంస్థలన్నిటిలో అవసరమైన ఉపాద్యాయుల నియామకాలు చేపడతామని చెప్పారు. నిరుద్యోగ ముస్లింలకి 10శాతం రాయితీతో స్వయం ఉపాధి పధకాలు ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ముస్లిం రైతులకి ట్రాక్టర్లు, వ్యవసాయ సంక్షేమ పధకాలని అందిస్తామని చెప్పారు. నిరుపేద ముస్లింలకి ఈ ఏడాది నుంచే మశీదులలో కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని దానిని క్రమంగా విస్తరిస్తామని చెప్పారు.