కెటిఆర్ ఈసారి ఏమి సాధించుకొస్తారో?

రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ ఇదివరకు ఒకసారి అమెరికా వెళ్ళివచ్చారు. మళ్ళీ అదేపని మీద నిన్న రాత్రి ఆయన అమెరికాకి బయలుదేరారు. ఆయన అక్టోబర్ 19వరకు అమెరికాలో వాషింగ్టన్, న్యూజెర్సీ, న్యూయార్క్, చికాగో, మిన్నెసోట, సిలికాన్ వ్యాలీ తదితర ప్రాంతాలలో పర్యటిస్తారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమయ్యి రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన కోసం తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సహకాలు, అనుసరిస్తున్న విధివిధానాలు, రాష్ట్రంలో వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితుల గురించి వివరించి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకి ఆహ్వానిస్తారు. 

ఈసారి పర్యటనలో జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ సంస్థలతో పరిశ్రమల స్థాపనకి ఒప్పందాలు చేసుకోబోతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆకర్షణీయమైన నగరాల అభివృద్ధి కోసం ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రభుత్వంతో కెటిఆర్ ఒప్పందం కుదుర్చుకోబోతున్నారని సమాచారం. గత ఏడాది ఆయన అమెరికా పర్యటించిన తరువాత రాష్ట్రానికి గూగూల్ వంటి పెద్ద సంస్థలు తరలివచ్చాయి కనుక ఈసారి ఆయన పర్యటనలో రాష్ట్రానికి ఏమి సాధించుకొని వస్తారో చూడాలి.