సిద్ధిపేటతో విడదీయలేని అనుబందం ఉంది!

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఈరోజు సిద్ధిపేట జిల్లాని ప్రారంభించిన తరువాత చేసిన ప్రసంగంలో కొంచెం భావోద్వేగంతో మాట్లాడారు. సిద్దిపేట ప్రజల చేతుల్లో పెరిగిన బిడ్డడినని, ఇక్కడి నేలతో, మనుషులతో తనకి విడదీయలేని అనుబంధం ఉందని కెసిఆర్ చెప్పారు. సిద్ధిపేటని జిల్లాగా చూడాలనే తన కల ఇన్నాళ్ళకి సాకారం అయినందుకు చాలా సంతోషిస్తున్నానని చెప్పారు. తాను జిల్లాకి ఇంకా రెండు పనులు బాకీపడి ఉన్నానని వాటిలో ఒకటి రైలు మార్గం ఏర్పాటు చేయడం, అన్ని గ్రామాలకి సాగునీరు అందించడం అని చెప్పారు. అవి కూడా త్వరలో నెరవేర్చుకొని జిల్లా రుణం తీర్చుకొంటానని చెప్పారు.

సిద్ధిపేట జిల్లాగా ఏర్పడింది కనుక ఇక శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అందుకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తానని, మంత్రి హరీష్ రావు బాధ్యత తీసుకొని వాటిని పూర్తి చేస్తారని చెప్పారు. హరీష్ రావు అభ్యర్ధనమేరకు సిద్ధిపేట అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించానని ముఖ్యమంత్రి చెప్పారు. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రి, కలెక్టర్ కార్యాలయం, న్యాయస్థానాలు, ఎస్పి కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మేనల్లుడు హరీష్ రావు చాలా చక్కాగా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. జిల్లా సరైన వ్యక్తి చేతిలో ఉందని కనుక వేగంగా అభివృద్ధి సాధించడం ఖాయమని చెప్పారు.