అది కెసిఆర్ దూరదృష్టికి నిదర్శనం

తెలంగాణా రాష్ట్రంలో ఈరోజు ఒకేసారి 21 కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ తో సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ జిల్లాలని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అన్ని జిల్లాలలో కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు వెంటనే బాధ్యతలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి ప్రారంభోత్సవం చేసిన మంత్రి కెటిఆర్ ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణా ఏర్పడక ముందే రాష్ట్రం ఏవిధంగా తీర్చిదిద్దాలని కెసిఆర్ ఆలోచించడం ఆయన దూరదృష్టికి నిదర్శనం. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారానే రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం అవుతుందని భావించిన కెసిఆర్ ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటూ కొత్త జిల్లాలని ఏర్పాటు చేశారు. భౌగోళికంగా, జనాభాపరంగా ఏవిధంగా చూసినా కూడా ఇదివరకు జిల్లాల మధ్య చాలా తేడాలు కనబడేవి. ముఖ్యమంత్రి కెసిఆర్ వాటన్నిటినీ శాస్త్రీయంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పునర్విభజించి ప్రజల ముంగిట్లోకి పాలనని తీసుకువచ్చారు. కార్మిక, ధార్మిక క్షేత్రంగా పేరున్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి కోసం అవసరమైన అన్ని చర్యలు చేపడతాము. రానున్న రెండేళ్ళలో జిల్లలో ప్రతీ ఎకరానికి సాగు నీరు, ప్రతీ గొంతుకు స్వచ్చమైన త్రాగునీరు అందిస్తామని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమాలతో యావత్ రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొని ఉంది. కానీ ఈ కార్యక్రమాలలో ఎక్కడా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల ప్రమేయం లేకుండానే సాగిపోయాయి. తెరాస సర్కార్ వారిని కూడా కలుపుకొని వెళ్ళి ఉండి ఉంటే బాగుండేది.