ఈ నెల 2వ తేదీన తన తల్లి శ్రీదేవితో కలిసి దసరా పండుగకని తాతగారి ఇంటికి బయలుదేరిన నాలుగేళ్ళ చిన్నారి సంజన ఒక త్రాగుబోతు కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి గురై కామినేని ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చావుబ్రతుకుల మద్య ఊగిసలాడుతోంది. ఆమె తల్లి శ్రీదేవి కోలుకొంటున్నప్పటికీ సంజన మాత్రం ఇంకా కోలుకోలేదు.
మొదట ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు ప్రకటించారు కానీ ఆ తరువాత తమ ప్రకటనని ఉపసంహరించుకొని ఆమె కోమాలో ఉందని తెలిపారు. గత 9 రోజులుగా కోమాలోనే ఉన్న చిన్నారి సంజన నిన్న ఉదయం కళ్ళు విప్పి చూసింది. అది చూసి ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. ఆమె కళ్ళు తెరిచి చూసినప్పటికీ ఆమె ఎవరినీ గుర్తుపట్టడం లేదు. కనుక ఆమె ఇంకా కోమాలో ఉన్నట్లేనని వైద్యులు భావిస్తున్నారు.
ప్రమాదం కారణంగా ఆమె మెదడులో నరాల్లో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. దానిని కరిగించేందుకు మందుల ద్వారా చికిత్స చేస్తున్నారు. బహుశః వారి చికిత్స ఫలిస్తునందునే మెదడులో కళ్ళకి సంబందించిన నరాలలో గడ్డ కట్టిన రక్తం కరిగి ప్రవహించడం మొదలైందని భావించవలసి ఉంటుంది. ఆమె పరిస్థితి మరికొంత మెరుగుపడిన తరువాత ఆమెకి వెంటిలేటర్ తొలగించి చూస్తారు. అప్పుడూ ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లయితే ఆమెకి ప్రాణాపాయం తప్పినట్లే.
నాలుగేళ్ళ ఆ చిన్నారికి వచ్చిన ఈ కష్టం ఆమెకొని తెచ్చుకొన్నది కాదు. తల్లి చెయ్యి పట్టుకొని రోడ్డు పక్కన నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో తప్పత్రాగి కారు నడుపుతున్న వ్యక్తి ఆమెని గుద్దేయడంతో ఆ చిన్నారికి ఇంత కష్టం వచ్చింది. ఆ ప్రమాదంలో ఆమె తల్లి శ్రీదేవి కూడా తీవ్రంగా గాయపడింది కానీ ఆమె మెల్లగా కోలుకొంటున్నారు. చిన్నారి సంజన పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉంది. ఎవరో చేసిన తప్పుకి, నిర్లక్ష్యానికి పాపం చిన్నారి సంజన మూల్యం చెల్లించవలసి రావడం అందరి మనసులని కలచివేస్తుంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఈ దశమి రోజున అందరూ ఒకసారి ఆ దుర్గాదేవిని ప్రార్దిద్దాము. అందరి ప్రార్ధనలతో ఆమె తప్పక కోలుకొంటుందని ఆశిద్దాము.