తెలంగాణాలో రేపటి నుంచే కొత్త జిల్లాలు ఏర్పడబోతున్న సంగతి ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా చాలాసార్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు దాని కోసం నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఎందుకంటే దానికి కూడా ముహూర్తం ఉందిట. సోమవారం రాత్రి 12.12 గంటలకి నోటిఫికేషన్ జారీ చేయడానికి ముహూర్తంగా నిర్ణయించారుట. అలాగే అన్ని జిల్లాలకి కలెక్టర్ల పేర్లు ప్రకటించినప్పటికీ, సదరు ఫైల్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంకా సంతకం చేయలేదు. ఎందుకంటే దానికీ ముహూర్తం ఉందిట. ఈరోజు అర్దరాత్రి దాటిన తరువాత తెల్లవారితే మంగళవారం అనగా సరిగ్గా 2 గంటలకి ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేస్తారుట! రేపు ఉదయం 11.12 గంటలకి సిద్ధిపేట జిల్లా ఏర్పాటు అయినట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటిస్తారుట!
ముఖ్యమంత్రి సిద్ధిపేట రాక సందర్భంగా ఆయనకి ఘనంగా స్వాగతం పలకడానికి చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రిని జిల్లాకి ఆహ్వానించడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ దానికి మరీ అంత అట్టహాసం చేయడం అవసరమా? అనే సందేహం కలుగుతుంది. అది తనని తాను మరింత గొప్పగా ప్రాజెక్ట్ చేసుకొనే ప్రయత్నంగానే కనిపిస్తుంది.