జిల్లాల పునర్విభజనపై తెరాస సర్కార్ ని పదేపదే విమర్శిస్తున్న ప్రతిపక్షాలకి ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ఘాటుగా జవాబు చెప్పడమే కాదు..వాటికి సూటి ప్రశ్నలు కూడా సందించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్న బంగారు కిరీటం సమర్పించుకొన్న తరువాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, “జిల్లాల పునర్విభజన ఏర్పాటు రాత్రికి రాత్రి తీసుకొన్న నిర్ణయమూ కాదు...ఎవరినీ సంప్రదించకుండా తీసుకొన్నదీ కాదని మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకి కూడా తెలుసు. గత రెండేళ్లుగా దీని గురించి మా ప్రభుత్వం కసరత్తు చేస్తూనే ఉంది. ప్రజలు, ప్రతిపక్షాల అభిప్రాయాలు సేకరించి వాటికి అనుగుణంగానే జిల్లాల పునర్విభజన చేస్తోంది. కాంగ్రెస్ నేతలు కోరినట్లే జిల్లాలు ఏర్పాటు చేసినసంగతి వారికి తెలియదా?మరి జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుగలేదని ఎందుకు వాదిస్తున్నారు? అసలు శాస్త్రీయత అంటే ఏమిటి? వాట్ ఈజ్ శాస్త్రీయత? దాని గురించి వారే వివరిస్తే బాగుండేది కదా. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుంటే ఏడుస్తున్న కాంగ్రెస్ నేతలు ఒకప్పుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కూడా అవసరం లేదనివాదించారు. ఇటువంటి నేతలా మా ప్రభుత్వాన్ని విమర్శించేది?” అని ప్రశ్నించారు.
తన ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సరైన వ్యూహాలు కూడా రచించుకోలేకపోతోందని ముఖ్యమంత్రి విమర్శించడం విశేషమే. రాష్ట్ర వ్యాప్తంగా బారీ వర్షాలు పడి చెరువులు, కుంటలు, నదులు నీళ్ళు నిండి కళకళలాడుతుడటం చూసి రైతులు చాలా సంతోషిస్తుంటే, కాంగ్రెస్ నేతలు రైతు సమస్యలపై పోరాటాన్ని ఎంచుకోవడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణ అని కెసిఆర్ అన్నారు. దానిని బట్టి ప్రభుత్వంతో పోరాడేందుకు కాంగ్రెస్ నేతలు ఏ అంశం లేదా సమస్యని ఎంచుకోవాలో కూడా తెలియని అయోమయ స్థితిలో ఉన్నారని కెసిఆర్ అన్నారు.
ముఖ్యమంత్రి సిపిఎం పార్టీకి కూడా చురకలు వేశారు. “రాష్ట్ర విభజనని వ్యతిరేకించడం ద్వారా తెలంగాణా ఏర్పాటుని వ్యతిరేకించిన పార్టీ సిపిఎం. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలంగాణా ప్రజలని చైతన్యపరిచేందుకు రాష్ట్రంలో 5 నెలలు పాదయాత్ర చేస్తారుట! అప్పుడు తెలంగాణా రాష్ట్రమే వద్దన్న పార్టీ ఇప్పుడు తెలంగాణా అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడుతోంది? తెలంగాణా రాష్ట్రం వద్దని చెప్పినందుకు ఆయన ముందు ప్రజలకి క్షమాపణలు చెప్పి ఆ తరువాత ఆయన ఊరిలో అడుగుపెట్టాలి. ప్రజలు కూడా ఇదే విషయం గురించి ఆయనని గట్టిగా నిలదీసి అడగాలి,” అని కెసిఆర్ అన్నారు.