తెలంగాణా ప్రజలకి రేపు రెండు పండుగలు

తెలంగాణాలో రేపు దసరా పండగ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలు పనిచేయడం మొదలుపెడతాయి. ఆయా జిల్లాల మంత్రులు, తెరాస ప్రజా ప్రతినిధులు కొత్త జిల్లాల ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సిద్ధిపేట జిల్లాని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా రేపు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. సిద్ధిపేట ప్రజల చిరకాలవాంఛని తీర్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఘనంగా స్వాగతం చెప్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సంబురాలు నిర్వహించబోతున్నారు. సిద్ధిపేట జిల్లాలో కూడా వెయ్యి మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తారు. దాని కోసం కూడా అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు దసరా పండుగ రోజునే కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తున్న కారణంగా ఒకేరోజు రెండు పండగలు కలిసి వచ్చినట్లు అవడంతో రాష్ట్రమంతటా చాలా సందడిగా, పండుగ వాతావరణం నెలకొని ఉంది. ప్రజలు, ప్రభుత్వం అందరూ కలిసి ఈవిధంగా పండుగ జరుపుకోవడం విశేషమే.