గిన్నిస్ రికార్డుకెక్కిన మన బతుకమ్మ

ఈరోజు హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో జి.హెచ్.ఎం.సి. నిర్వహించిన మహా బతుకమ్మ సంబురాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాయి. స్టేడియం మధ్యలో 20 అడుగుల ఎత్తున్న బతుకమ్మని ఏర్పాటు చేశారు. దాని చుట్టూ ఒకేసారి 9,292 మంది మహిళలు వలయాకారంగా 35 వరుసలలో తిరుగుతూ బతుకమ్మ ఆడారు. 

గిన్నిస్ బుక్ ప్రతినిధులు జయసింహ, కార్తిక్, కుమరన్ ల సమక్షంలో సాయంత్రం 5.12 గంటలకి మొదలైన ఈ బతుకమ్మ నృత్యం 5.25 వరకు సాగింది. అనంతరం వారి కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు అయినట్లు ప్రకటించారు. 

ఈ బతుకమ్మ నృత్యంలో తెలంగాణా బ్రాండ్ ఎంబాసడర్ సానియా మీర్జా, ఒలింపిక్ రజతపతక విజేత పివి సింధు కూడా పాల్గొనడం విశేషం. వారితో పాటు కొందరు విదేశీ వనితలు కూడా చక్కగా చీరలు కట్టుకొని బతుకమ్మ నృత్యం చేయడం అందరినీ చాలా అలరించింది. 

బతుకమ్మ నృత్యం మొదలైనప్పుడు చిన్నగా వాన మొదలైనప్పటికీ మహిళలు ఏమాత్రం తడబడకుండా హుషారుగా నృత్యం చేసారు. వారి పట్టుదల చూసి వరుణదేవుడు కూడా వెనక్కి తగ్గి మహా బతుకమ్మని గౌరవించాడు. దానితో వారు మరింత హుషారుగా బతుకమ్మ ఆది గిన్నిస్ రికార్డు సృష్టించారు. గిన్నిస్ రికార్డులోకి వారి బతుకమ్మ నృత్యం ఎక్కినట్లు ప్రకటించగానే స్టేడియంలో మహిళలతో సహా ప్రజలందరూ చాలా ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. 

కేరళలో ఓనం పండుగ సందర్భంగా అక్కడి మహిళలు పూలతో చేసిన గొబ్బెమ్మలు వంటివి పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. గతంలో 5,211 మంది కేరళ మహిళలు నృత్యం చేసి గిన్నిస్ రికార్డు సృష్టించగా దానిని తెలంగాణా మహిళలు ఈరోజు అధిగమించారు. బతుకమ్మ ఉత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం, మొదటి ప్రయత్నంలోనే ప్రపంచ రికార్డు సాధించడంతో రాష్ట్రంలో మహిళలు అందరూ చాలా ఆనందం క్తం చేస్తున్నారు.