ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ సంబురాలు

నేడు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో మహా బతుకమ్మ సంబురాలు జి.హెచ్.ఎం.సి.నిర్వహించబోతోంది. దాని కోసం చాలా బారీ ఏర్పాట్లు చేసింది. ఈ ఉత్సవాలలో ప్రత్యేకత ఏమిటంటే, 20 అడుగులు ఎత్తున్న బతుకమ్మని స్టేడియం మధ్యలో ఉంచి, దాని చుట్టూ ఒకేసారి 10,000 మహిళలు బతుకమ్మ ఆడబోతున్నారు. దీనిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మహా బతుకమ్మ చుట్టూ మరో 35 వరుసలలో బతుకమ్మ బృందాలు ఆడిపాడుతాయి.  తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవాల కోసం ఎల్బి స్టేడియంని రకరకాల అందమైన పూలు, రంగురంగుల విద్యుత్ దీపాలతో చాలా చక్కగా అలంకరిస్తున్నారు.

ఈ ఉత్సవాలకి సుమారు 50,000 మంది మహిళలు, లక్ష మందికి పైగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కనుక అందుకు తగ్గట్లుగానే పోలీసులు బారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం లోపల, బయట, దాని పరిసర ప్రాంతాలని పరిశీలించేందుకు 29 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న మహిళలకోసం ప్రత్యేక వసతి, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. అప్పుడే జనం కూడా అక్కడికి చేరుకొంటున్నారు. సాయంత్రం 5-8గంటల వరకు మహా బతుకమ్మ పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతకంటే ముందుగానే సాంస్కృతిక కల ప్రదర్శనలు మొదలవుతాయి. తెలంగాణా సంస్కృతి, సంప్రదాయాలని ప్రపంచ వ్యాప్తంగా అందరూ గుర్తించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మహా బతుకమ్మ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు.