5.jpg)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి ఓ కొత్త సమస్య వచ్చిపడింది. అది త్వరలో 5 రాష్ట్రాలలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో పార్టీని గెలిపించుకోవడమో లేదా పార్టీలో సీనియర్లు తన నాయకత్వాన్ని ప్రశ్నిస్తుందటమో కాదు. గత ఏడాది ఆగస్ట్ నుంచి ట్విట్టర్‌లో ఆయన అనుసరించేవారి (ఫాలోవర్స్) సంఖ్య పెరగడం నిలిచిపోయింది. అదే ఆయన సమస్య. దీనిపై రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు గత నెల 27వ తేదీన ఓ లేఖ వ్రాశారు.
“నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతను కనుక దేశంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై పోరాడవలసి ఉంటుంది. అయితే మోడీ ప్రభుత్వం ఇప్పటికే మీడియాను తన గుప్పెట్లో పెట్టుకొని నా గొంతు ప్రజలకు వినిపించకుండా అడ్డుపడుతోంది. కనుక సోషల్ మీడియా ద్వారా మాత్రమే నా గొంతు వినిపించగలుగుతున్నాను. కానీ దానిని కూడా మోడీ ప్రభుత్వం నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగానే ట్విట్టర్‌పై కూడా ఒత్తిడి చేస్తూ నా ఫాలోవర్స్ పెరగకుండా చేస్తోంది. గత ఏడాది ఆగస్ట్ నాటికి నాకు 1.95 కోట్లు ఫాలోవర్స్ ఉండగా నేటికీ అది అంతే ఉండటమే ఇందుకు నిదర్శనం. ప్రశ్నించే గొంతులను అణచివేసే కేంద్రప్రభుత్వ కుట్రలో ట్విట్టర్ కూడా భాగస్వామి కాకూడదని కోరుకొంటున్నాను,” అని వ్రాశారు.
అయితే ట్విట్టర్ దీనిని ఖండించింది. మెషీన్ లెర్నింగ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్విట్టర్‌లో తప్పుడు గణాంకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటాం. దీనిలో భాగంగా కొందరు ఫాలోవర్స్ సంఖ్య తగ్గి ఉండవచ్చు. అలాగే ఇదే సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎప్పటికప్పుడు లక్షల మంది ఖాతాలు తొలగిస్తుంటాం. మీ విషయంలో ఇటువంటి పొరపాట్లు జరిగేందుకు ఆస్కారం లేదు,” అని తేల్చి చెప్పింది.