
నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ బుదవారం హైదరాబాద్ బిజెపి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “నేను నిజామాబాద్ పర్యటించినప్పుడు నాపై పసుపు రైతుల ముసుగులో టిఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాతబస్తీ నుంచి గూండాలను తెప్పించి వారితో నాపై దాడి చేయించారు. దీనికి నావద్ద స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. నాపై దాడి జరిగే అవకాశం ఉందని నేను ముందుగానే పోలీసులకు తెలిపినప్పటికీ సీపీ నాగరాజు నాకు భద్రత కల్పించలేదు. టిఆర్ఎస్ గూండాలు నాపై దాడి చేస్తున్నప్పుడు వారి నుంచి నన్ను మా పార్టీ కార్యకర్తలే కాపాడారు. నా ప్రాణాలు కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు,” అని ఆరోపించారు.
ఇటీవల ఎంపీ ధర్మపురి అర్వింద్ తాను ఎంపీ అయిన పదిరోజులలోనే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, పసుపు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని స్టాంప్ పేపరు మీద వ్రాసి ఇచ్చి మాట తప్పారని ఆరోపిస్తూ పసుపు రైతులు ఆయన కారుపై రాళ్ళతో దాడి చేశారు.
అయితే ఎంపీలపై ఎవరు దాడికి పాల్పడినప్పటికీ దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎంపీ బండి సంజయ్ కరీంనగర్‌లో జనజాగరణ దీక్ష చేసినప్పుడు పోలీసులే ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ, ఈ ఘటనపై లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ సిఎస్ సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ అధికారులను సంజాయిషీ కోరుతూ నోటీసులు పంపడమే ఇందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కనుక రాష్ట్రంలో తరచూ ఎంపీలపై దాడులు జరుగుతున్నట్లయితే అది తెలంగాణ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.