మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై సీఈసీ విచారణ?

తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కేంద్ర ఎన్నికల కమీషన్‌ విచారణ జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 శాసనసభ ఎన్నికలలో ఆయన రిటర్నింగ్ అధికారికి రెండు అఫిడవిట్లు సమర్పించగా వాటిలో ఒకదానిలో లోపాలున్నట్లు గుర్తించి, స్థానిక అధికారుల సాయంతో దానిని ఈసీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించినట్లు ఆయనపై గత ఏడాది ఆగస్టు నెలలో ఎన్నికల సంఘానికి ఓ ఫిర్యాదు అందింది. 

ఈసీ వెబ్‌సైట్‌లో ఒకసారి అప్‌లోడ్ చేసిన అఫిడవిట్‌ను తొలగించడం సాధ్యం కాదు. ఒకవేళ ఏవిదంగానైనా తొలగిస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్‌ను తొలగించే ప్రయత్నంలో ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేసినట్లు ఫిర్యాదు అందింది. ఇటీవల ఢిల్లీ సర్వీసులకు బదిలీ అయిన తెలంగాణ ఎన్నికల కమీషనర్‌ శశాంక్ గోయల్, బదిలీపై వెళ్ళే ముందు దీనికి సంబందించి నివేదికను కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పంపించారు. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల కమీషన్‌ తమ సాంకేతిక నిపుణుల బృందంతో విచారణ జరిపిస్తున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ నిపుణుల బృందం ఈసీ వెబ్‌సైట్‌ను ట్యాంపరింగ్ చేయడం నిజమేనని దృవీకరించినట్లయితే చట్ట ప్రకారం చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.