ఫిబ్రవరి 7నుంచి ఏపీ ప్రభుత్వోద్యోగులు నిరవదిక సమ్మె

ఏపీ ప్రభుత్వోద్యోగులు ఫిబ్రవరి 7నుంచి నిరవదిక సమ్మె చేయబోతున్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలు సోమవారం అమరావతిలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలవుతుందని వారు దానిలో పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులు, వైద్య,ఆరోగ్యశాఖ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు అందరూ ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 6వరకు ఉద్యోగులు అందరూ రకరకాలుగా ప్రభుత్వానికి నిరసనలు తెలపాలని నిర్ణయించారు.

ఏపీ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై నిన్న హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు వేతన సవరణతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరుగుతాయని అటార్నీ జనరల్ శ్రీరామ్ వాదించగా, విభజన చట్టం ప్రకారం ప్రభుత్వం తమకు వేతన సవరణ, హెచ్ఆర్ఏ ఇవ్వలేదని, హెచ్ఆర్ఏలో కోత విధించడం వలన తమ జీతాలు భారీగా తగ్గిపోతాయనే వాదించారు. ఉద్యోగ సంఘాల వాదనల పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పిటిషన్‌ను ప్రజా ప్రయోజన పిటిషన్‌గా పరిగణించలేమని తేల్చి చెప్పింది. సమ్మె ఇంకా ప్రారంభించక మునుపే వారికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెనక్కు తీసుకొనే వరకు మంత్రుల కమిటీతో చర్చలకు రాబోమని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ నేతలు ప్రకటించగా, ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అమరావతిలో సచివాలయంలోని ఆర్ధికశాఖ కార్యాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ ఆహ్వానం పంపించడం విశేషం. 

అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గే సూచనలు కనబడటం లేదు. కనుక ఏపీ ప్రభుత్వానికి, ఉద్యోగులకు మద్య ఏర్పడిన ఈ ప్రతిష్టంభన ఇప్పట్లో ముగిసేలా లేదు. కానీ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె చేస్తే ఆంధ్రప్రదేశ్‌ స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులలో ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 6వ తేదీలోగా ఈ సమస్యను పరిష్కరించక తప్పదు.