తెలంగాణా మంత్రివర్గ నిర్ణయాలు ఇవే

ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కొద్ది సేపటి క్రితం ముగిసింది. ఊహించినట్లే 31 జిల్లాలకి మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ వివరాలు:

1. బిసీ కమీషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం.

2. హైదరాబాద్ లో అక్రమకట్టడాల తొలగింపు కేసుల కోసం మున్సిపల్ ట్రిబ్యునల్ ఏర్పాటు.

3. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకి వీలుగా రాష్ట్ర జిల్లా పునర్వ్యవస్థీకరణ చట్టం 1974కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

4. రాష్ట్రంలో కొత్తగా 23 కొత్త పోలీస్ సబ్ డివిజన్లు, 28 కొత్త సర్కిళ్లు, 92 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు. 

5. వచ్చే విద్యా సంవత్సరంలో 119 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు. 

6. వచ్చే విద్యా సంవత్సరంలో మైనార్టీల కోసం 90 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు.  

7. రాష్ట్రంలో కొత్తగా రామగుండం సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో పోలీస్ కమిషనరేట్లని ఏర్పాటు చేయడం.

8. యదాద్రి, పెద్ద శంకరం పేటలో కొత్తగా ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయడం.

9. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వి.టి.డి.ఎ.) పరిధిలోకి తిమ్మాపూర్, సంకేపల్లి, నాంపల్లి, చంద్రగిరి, మరుపాక, శాత్రాజపల్లి గ్రామాలని చేర్చడం. 

10. జీ.హెచ్‌.ఎం.సి. పరిధిలో 24, 648 ఇండ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు హడ్కో నుంచి రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. 

11. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి తరహాలో శేరిలింగంపల్లి మండలంలో ఖానాపేటలో కేన్సర్ ఆసుపత్రి నిర్మించేందుకు నెలకొల్పేందుకు హెటిరో సంస్థ ఆధ్వర్యంలో సాయి సింధూ ఫౌండేషన్ కి 15 ఎకరాల భూమి కేటాయింపుకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

12. విధి నిర్వహణలో మరణించిన 321మంది పోలీసు అమరవీరుల కుటుంబాలకి రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఆర్టీసి ఉచిత బస్సు సౌకర్యం. 

13. ఇకపై ఎమ్మార్వోలు తహసీల్దారులుగా గుర్తింపు.