నిద్రపోతున్న పులిని తట్టి లేపావు: కొండా సురేఖ

మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ కొండా సురేఖ మళ్ళీ చాలా రోజుల తరువాత మీడియా దృష్టిలోకి వచ్చారు. పరకాల టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి, కొండా దంపతులకు మద్య మొదలైన ఓ ఘర్షణ దీనికి కారణం. 

జిల్లాలో ఆత్మకూర్ మండలంలోని ఆగ్రంపహాడ్‌లో ప్రతీ రెండేళ్ళకు సమ్మక్కసారలమ్మ జాతర జరుగుతుంటుంది. త్వరలో జాతర నిర్వహించబోతున్నందున ఆలయ పాలక మండలి మొన్న సమావేశమైంది. దానిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి గద్దెలకు సమీపంలో సమాధులుండటంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటిని తక్షణం తొలగించాలని ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన అనుచరులను ఆదేశించారు. ఈ విషయం తెలుసుకొన్న కొండా దంపతుల అనుచరులు అక్కడకు చేరుకొన్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మద్య ఘర్షణ జరిగింది.

ఈ ఘటనపై కొండా సురేఖ పరకాలలో మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కడ మూడెకరాల స్థలం కొని మా అత్తమామల పేరు మీదుగా ప్రజల కోసం వినియోగిస్తున్నాము. నేటికీ ఆ భూమి మా కుమార్తె సుస్మితా పటేల్ పేరనే ఉంది. అది ఓ ప్రైవేట్ భూమి. దానిలో మా అత్తమామల సమాధులు ఉండటం తప్పు ఎలా అవుతుంది? గతంలో మూడు కోట్లు కాంట్రాక్టుల కోసం నా ముందు చేతులు కట్టుకొని నిలబడిన చల్లా ధర్మారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే చాలా రెచ్చిపోతున్నాడు. మా అత్తమామల సమాధులను ధ్వంసం చేయాలని ప్రయత్నించడం చాలా దారుణం. నేను పరకాలకు దూరంగా ఉన్నాను కనుకనే నువ్వు ఎమ్మెల్యే కాగలిగావనే సంగతి మరిచిపోయావు. కొండా దంపతులను ఢీకొట్టడం అంటే కొండను ఢీ కొట్టడమే. ధర్మారెడ్డీ...నిద్రపోతున్న పులిని తట్టి లేపావు. ఇక ఏమవుతుందో చూస్కో,” అని తీవ్ర స్థాయిలో హెచ్చారించారు.      

దీనిపై ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందిస్తూ, “వెయ్యి తప్పులు చేసిన కొండా దంపతులు ఇప్పటికే నాశనం అయ్యారు. ఇంకా వారి తీరు మారకపోతే పూర్తిగా నాశనం అవుతారు. అయినా అమ్మవారి గద్దెల పక్కన సమాధులు, విగ్రహాలు పెట్టడం ఏమిటి?వారు నిద్రపోతున్న సింహాలు కారు లేవలేని స్థితిలో ఉన్న సింహాలు. వారి బెదిరింపులకు నేను భయపడేది లేదు,” అని అన్నారు.