జోనల్ విధానంలో భాగంగా జరుగుతున్న ప్రభుత్వోద్యోగుల బదిలీలపై నిన్న టీఎన్జీవో నేతలు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. లోకల్ క్యాడర్ ఉద్యోగుల బదిలీలలో పరస్పర బదిలీలలకు అనుమతించాలని, ముఖ్యంగా భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వాలని, సీనియర్ల జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలని వారు కోరారు. ఆయన ఈ సమస్యలను వెంటనే సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళగ్గా సానుకూలంగా స్పందించారు. పరస్పర బదిలీలను అనుమతిస్తూ నేడు జీవో జారీ చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. భార్యాభర్తల బదిలీలలకు సంబందించి వస్తున్న వినతులు, అభ్యంతరాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.