
ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలో రాజ్‌పథ్ రోడ్డులో జరుగబోయే పెరేడ్‌లో కేవలం 12 రాష్ట్రాలకు చెందిన శకటాలు, తొమ్మిది శాఖలకు చెందిన శకటాలు మాత్రమే పాల్గొంటాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటకకు మాత్రమే అవకాశం దక్కింది. కనుక ఈసారి పెరేడ్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల శకటాలు కనిపించవు.
రిపబ్లిక్ డే పెరేడ్‌లో త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగబోతున్న పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన శకటాలు పాల్గొంటాయి.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్ర శకటాలకు కేంద్రం అనుమతించకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లేఖలు వ్రాశారు. అయితే శకటాల ఎంపికలో కేంద్రప్రభుత్వం కలుగజేసుకోదని, పెరేడ్ నిర్వహణ కమిటీయే నిర్ణయిస్తుందని కేంద్రం సమాధానం చెప్పింది.
ఈసారి ఢిల్లీలో చాలా ఎక్కువగా మంచు కురుస్తున్నందున పెరేడ్ ఉదయం 10 గంటలకు బదులు 10.30కి మొదలవుతుంది. పెరేడ్ ముగింపు ఉత్సవాలలో భాగంగా జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంలో 1,000 డ్రోన్‌లు పాల్గొనబోతున్నాయి. ఢిల్లీ ఐఐటి సహకారంతో బోట్‌లాబ్ అనే అంకుర సంస్థ వీటిని తయారుచేసి ప్రదర్శించబోతోంది. దేశంలో తొలిసారిగా ఒకేసారి ఇన్ని డ్రోన్‌లతో ప్రదర్శన జరుగబోతోంది. అలాగే అదే రోజున తొలిసారిగా ఢిల్లీలో సౌత్, నార్త్ బ్లాక్ గోడలపై మూడు నిమిషాల వ్యవధి కలిగిన లేజర్ షోలు ప్రదర్శిస్తారు. ఈసారి పారిశుధ్య కార్మికులు, భావనా నిర్మాణ కార్మికులు, ఆటో రిక్షా డ్రైవర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించి వారు కూడా 26న జరిగే పెరేడ్, 29న జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.