జీవో 317పై స్టే జారీకి నిరాకరించిన హైకోర్టు

కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా ఉద్యోగుల బదిలీలలకు సంబందించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 వలన అనేకమంది ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల సరస్వతి, శ్రీమతి (మాధవి) అనే ఇద్దరు మహిళా ఉపాధ్యాయురాళ్ళు ఈ కారణంగా ప్రాణాలు కూడా కోల్పోయారు. కనుక ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను నిలిపివేస్తూ  స్టే జారీ చేయాలని పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. 

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్‌ షావిలితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపు, ఉపాధ్యాయుల తరపు న్యాయవాదుల వాదనలు విన్న తరువాత జీవో 317పై స్టే జారీ చేసేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే పిటిషనర్ల (ఉపాధ్యాయుల) వాదనలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, జీవో 317 ద్వారా ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపులు లేదా బదిలీలన్నీ హైకోర్టు తుది తీర్పుకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. 

హైకోర్టు తుది తీర్పుకి లోబడి ఉండాలంటే అర్ధం ఒకవేళ తదుపరి విచారణలో ప్రభుత్వ వివరణ సంతృప్తికరంగా లేకపోయినా లేదా పిటిషనర్ల వాదన సమంజసంగా ఉన్నా ఇప్పటివరకు చేసిన కేటాయింపులు లేదా బదిలీలను హైకోర్టు పునః సమీక్షించవచ్చు అవసరమైతే జీవో 317 స్టే విధించవచ్చు. ఒకవేళ ప్రభుత్వ వాదనలు సమంజసంగా ఉన్నట్లయితే, ప్రస్తుతం జరుగుతున్న కేటాయింపులు, బదిలీలకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అయితే ఓ పక్క ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు జోరుగా సాగుతుంటే ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 4వరకు అంటే మరో మూడు నెలలు వాయిదా వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది.