భారత్‌లో మొదటిసారిగా హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసింగ్

ఫార్ములా-1 కార్ రేసింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉంది. దాని తరువాత స్థానంలో నిలుస్తోంది ‘ఫార్ములా-ఈ’ అసోసియేషన్ నిర్వహించే ఎలక్ట్రిక్ కార్ల రేసింగ్. ఇప్పటివరకు లండన్, పారిస్, రోమ్, న్యూయార్క్‌, బర్లిన్, హాంగ్ కాంగ్ నగరాలలో మాత్రమే ఫార్ములా-ఈ రేసింగ్ పోటీలు జరిగాయి. వీటి నిర్వహణ కోసం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలలో నగరాలు పోటీ పడుతుంటాయి. అయితే ఈసారి హైదరాబాద్‌ నగరం ఈ అవకాశాన్ని దక్కించుకొంది. భారత్‌లో మొట్ట మొదటిసారిగా హైదరాబాద్‌ నగరంలో ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2023, మార్చి వరకు జరుగుతాయి. వీటి కోసం ఫార్ములా-ఈ రేసింగ్ అసోసియేషన్ సహ వ్యవస్థాపకుడు ఆగస్ జోమనో, అల్బేర్టో లొంగో తదితరులు, మహీంద్రా రేసింగ్ సీఈఓ మరియు టీం ప్రిన్సిపాల్ దిల్‌బాగ్ గిల్, గ్రీన్‌కో గ్రూప్ సీఈఓ అనిల్ చలమశెట్టి, ప్రభుత్వం తరపున అధికారులు నిన్న మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 

దీనిపై మంత్రి కేటీఆర్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ప్రపంచ క్రీడా పటంలో హైదరాబాద్‌ కూడా ఈవిదంగా చేరడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. 


మహీంద్రా గ్రూప్ అధినేత, ఫార్ములా-ఈ రేసింగ్ అసోసియేషన్‌లో భాగస్వామి అయిన ఆనంద్ మహీంద్రా దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ, “ఫార్ములా-ఈ వ్యవస్థాపక రేసింగ్ టీంలలో ఒకటైన మా మహీంద్రా రేసింగ్ చిరకాల స్వప్నం సొంత గడ్డపైనే ప్రజల కేరింతల మద్య ఇన్నాళ్ళకు నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనిని సాకారం చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఫార్ములా-ఈ రేసింగ్ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.