ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగిపోతుండటంతో మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 

పోలీసులు, మున్సిపల్, వైద్య సిబ్బంది, అంబులెన్సులు తదితర అత్యవసర సర్వీసులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుంది. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కర్ఫ్యూ నుంచి మినహాయించింది. అలాగే కర్ఫ్యూ సమయంలో వేరే జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు పోలీసులకు తమ ప్రయాణ టికెట్స్ చూపించి ఇళ్ళకు చేరుకోవచ్చు. 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున నైట్ కర్ఫ్యూ విధించిన ఏపీ ప్రభుత్వం, పాఠశాలల సెలవులు పొడిగించకపోవడం విశేషం. సంక్రాంతి సెలవుల తరువాత నిన్నటి నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలలు  పునః ప్రారంభం అయ్యాయి. 

కర్ఫ్యూ సమయం మొదలయ్యే వరకు సినిమా థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకొనేందుకు ప్రభుత్వం అనుమతించింది. 

వివాహాలు, శుభకార్యాలు, బహిరంగ ప్రదేశాలలో మతపరమైన కార్యక్రమాలకు గరిష్టంగా 200 మందికి, అదే ఫంక్షన్ హాల్స్ లో అయితే 100 మందికి మాత్రమే అనుమతి. 

బహిరంగ ప్రదేశాలలో మాస్కు ధరించకపోతే రూ.100 జరిమానా. షాపింగ్ మాల్స్ ఆవరణలో ఉన్నవారు మాస్కులు ధరింపజేయడం యాజమాన్యాలదే బాధ్యత. ఎవరైనా మాస్కు లేకుండా పట్టుబడితే యాజమాన్యాలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకు జరిమానా. 

ప్రార్ధనా స్థలాలు, ప్రజా రవాణా వ్యవస్థలలో అందరూ తప్పనిసరిగా కరోనా ఆంక్షలు పాటించాలి.