
టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొనున్నారు. ఈనెల 24వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయన రాజ్యసభ పదవీకాలం త్వరలో ముగియనున్నందున ముందు తన పదవికి రాజీనామా చేసి తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అనేక పదవులు పొందిన డి శ్రీనివాస్, జూలై 2015లో టిఆర్ఎస్‌లో చేరారు. సిఎం కేసీఆర్ ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. కానీ ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ బిజెపిలో చేరి లోక్‌సభ ఎన్నికలలో సిఎం కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించడంతో శ్రీనివాస్‌కు టిఆర్ఎస్ పార్టీకి మద్య దూరం పెరిగింది. చివరికి పార్టీ నుంచి బహిష్కరించే పరిస్థితి ఏర్పడింది కానీ సిఎం కేసీఆర్ ఆయనను బహిష్కరించలేదు. కానీ అప్పటి నుండి తనను కలిసేందుకు ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. దాంతో డి శ్రీనివాస్ పార్టీలోనే ఉన్నా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది.
రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాక డి శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి పార్టీలోకి తిరిగి రావలసిందిగా ఆహ్వానించడంతో, సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దపడ్డారు. అయితే ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ బిజెపిలో ఉండగా తండ్రి డి శ్రీనివాస్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొంటే మళ్ళీ అవే ఇబ్బందులు వస్తాయని జిల్లా నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పార్టీలో చేర్చుకోవడానికే మొగ్గు చూపడంతో ఆయన చేరిక ఖాయం అయ్యింది.