తెలంగాణా రాష్ట్రం నేటికీ రెండు రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. 1. ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలు 2. మీడియా దుష్ప్రచారం
వాటిలో మొదటి సమస్య దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఉండేదే కనుక దానిని ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు. కానీ మరే రాష్ట్రానికి లేని రెండవ సమస్యని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవలసి వస్తోంది. మీడియా దుష్ప్రచారానికి కారణాలు అందరికీ తెలిసినవే కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకోనవసరం లేదు.
ఇక విషయం ఏమిటంటే, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్న ఎల్&టి కంపెనీకి దాని నిర్మాణం, నిర్వహణ రెండూ గుదిబండగా మారడంతో దానిని వదిలించుకొనే ప్రయత్నం చేస్తోందని రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, ప్రాజెక్టు మార్గంలో మార్పులు చేర్పులు, రైలు మార్గం పొడిగింపు వంటి అనేక కారణాల చేత ఆ ప్రాజెక్టు కంపెనీకి పెనుభారంగా మారిందని పేర్కొంది. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో వృద్ధి కనబడకపోవడం వంటి ఇతర కారణాల చేత ఆ ప్రాజెక్టుని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. హైదరాబాద్ మెట్రోని కొనుగోలు చేసేందుకు ఒక విదేశీ సంస్థ ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది.
ఎల్&టి కంపెనీ ప్రెసిడెంట్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఈ ప్రాజెక్టు నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ ఆ వార్తలని ఖండించారు. తమ కంపెనీ మెట్రో ప్రాజెక్టుని పూర్తిచేస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు అమ్మివేస్తామనే వార్తలలో నిజం లేదని తెలిపారు.
ఇటువంటి భారీ ప్రాజెక్టులో అప్పుడప్పుడు ఆర్ధిక, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటం సహజమేనని, అదేవిధంగా వివిధ కారణాల చేత అప్పుడపుడు నిర్మాణపనులు వేగం మందగించడం లేదా నిలిచిపోతుండటం సహజమేనని అన్నారు. ప్రస్తుతం అన్ని చోట్ల నిర్మాణ పనులు చాలా చురుకుగానే సాగుతున్నాయని చెప్పారు. ఇది తమ సంస్థకి చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని కనుక దీనిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రసక్తే లేదని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకొన్న సమయానికి కాస్త అటూ ఇటుగా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పారు.