హైదరాబాద్లో పార్టీ సభలు, సమాశాలలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ, సిపిఎం నేతలతో సిఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమావేశమైన సంగతి తెలిసిందే. దానిలో ప్రధానంగా బిజెపిని కలిసికట్టుగా ఎదుర్కోవడంపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలకి అడ్డుకట్టవేయడంపై కూడా వారు చర్చించారు. తమ సమావేశంపై సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి స్పందిస్తూ, “త్వరలో జరుగబోయే 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలలో బిజెపిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తాము. యూపీలో బిజెపిని వ్యతిరేకిస్తున్న సమాజ్వాదీ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాము. జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు గురించి సాధారణ ఎన్నికలు ముగిసిన తరువాతే ఆలోచిస్తాము. ముందుగా ఫ్రంట్ ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్ళడం వలన పెద్దగా ప్రయోజనం ఉంటుందనుకొను. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కనుక అప్పటి పరిస్థితులను బట్టి రాష్ట్రంలో పొత్తుల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.