
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసుతో సహా పలు కేసులలో నిందితుడుగా ఉన్న వనమా రాఘవేంద్రరావును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కొత్తగూడెం జిల్లా జ్యూడీషియల్ కోర్టులో హాజరుపరుచగా, న్యాయస్థానం అతనికి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతనిని ఖమ్మం సబ్ జైలుకి తరలించారు. అతనిపై మొత్తం 12 కేసులు ఉన్నట్లు జిల్లా ఏఎస్పీ రోహిత్ తెలిపారు. ఆ కేసులకు సంబందించి అతనిని ప్రశ్నించేందుకు న్యాయస్థానాన్ని పోలీస్ కస్టడీ కోరనున్నారు. వనమా రాఘవేంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ ప్రకటించింది. ఇంతకాలం అతను ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్నా చూసిచూడనట్లు ఉంటూ పరోక్షంగా అతనికి సహకరించినందుకు అతని తండ్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.