
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నాగ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్యలపై ఆయన తల్లి సూర్యవతి, అక్క కొమ్మిశెట్టి లోవమాధవి స్పందించారు.
పాత పాల్వంచలో తల్లి సూర్యవతి మీడియాతో మాట్లాడుతూ, “నా భర్త తహశీల్దార్గా పనిచేసేవారు. నక్సల్స్ దాడిలో ఆయన చనిపోయారు. అప్పటి నుంచి నేను నా కూతురు మాధవి వద్దనే ఉంటున్నాను. రామకృష్ణ విపరీతంగా అప్పులు చేసి వాటిని తీర్చుకొనేందుకు మా ఆస్తిని అమ్మేసి డబ్బు ఇవ్వాలని తరచూ ఒత్తిడి చేస్తుండేవాడు. ఈ విషయమై రామకృష్ణను ఎవరో రెచ్చగొట్టడంతో ఆవేశంతో తాను ఆత్మహత్య చేసుకొని భార్యాపిల్లలను కూడా చంపుకొన్నాడు. ఇందుకు మేము ఎంతో బాధపడుతున్నాము,” అని అన్నారు.
రామకృష్ణ అక్క లోవ మాధవి మీడియాతో మాట్లాడుతూ, “కొంతకాలం క్రితం మా నాన్నపోయారు. ఆ తరువాత మరో తమ్ముడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇటీవల నా భర్త కూడా అనారోగ్యంతో చనిపోయారు. కనుక మాకు మా తమ్ముడు రామకృష్ణే మగదిక్కు అనుకొంటే తాను కూడా ఇప్పుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. రామకృష్ణకు వ్యాపారంలో నష్టం రావడంతో అప్పులపాలయ్యాడు. ఆస్తి పంపకం విషయంలో రామకృష్ణ మాతో మాట్లాడి ఉండి ఉంటే వెంటనే సమస్యను పరిష్కరించుకొని ఉండేవాళ్ళం. మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లుగారు మా కుటుంబానికి అండగా ఉన్నారు. అందుకే మా తమ్ముడు వనమా రాఘవను కలిశాడు. అక్కడ వారిద్దరూ ఏమి మాట్లాడుకొన్నారో...ఏమనుకొన్నారో మాకు తెలీదు. కానీ తమ్ముడు ఆత్మహత్య చేసుకొన్నాడు. అతను ఇంత మానసిక క్షోభ అనుభవిస్తున్నాడని మాకు తెలియదు. తెలిసి ఉంటే ఇంతవరకు రానిచ్చేవాళ్ళమే కాదు. వనమా రాఘవాను కావాలనే ఈ వ్యవహారంలో ఇరికించేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది,” అని అన్నారు.