
గత నాలుగురోజులుగా పరారీలో ఉన్న వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవను అరెస్ట్ చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ ప్రకటించారు. అతను విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఏఎస్పీ ప్రసాద్ రావు అధ్వర్యంలో పోలీసుల బృందం శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి, తమ కార్యాలయానికి తరలించినట్లు ఎస్పీ సునీల్ దత్ దృవీకరించారు. ఇటీవల కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకొన్న మండిగ నాగ రామకృష్ణ కేసుతో పాటు గతంలో వనమా రాఘవపై ఉన్న పాత కేసులను కూడా పోలీసులు బయటకు తీసి విచారించబోతున్నట్లు తెలుస్తోంది.
వనమా రాఘవ వార్తలకెక్కడంతో అతని అకృత్యాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. రెండేళ్ల క్రితం వనమా రాఘవ తన అనుచరులతో కలిసి పాల్వంచలో ఓ కుటుంబానికి చెందిన రూ.50 లక్షల విలువైన ఆస్తిని బలవంతంగా ఆక్రమించుకొన్నారు. తాము జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ తమ గోడు ఎవరూ పట్టించుకోలేదని బాధితురాలు జ్యోతి తెలిపారు.
పాల్వంచలోనే కాంట్రాక్టర్ కాలనీలో నివశిస్తున్న జాన్ రాంకుమార్ అనే వ్యక్తిని వనమా రాఘవ అనుచరులు 2020లో బెదిరించి అతని కుటుంబానికి చెందిన మూడెకరాల భూమిని కబ్జా చేశారు. మళ్ళీ అటువైపు వస్తే ప్రాణాలు దక్కవని వనమా అనుచరులు బెదిరించడంతో తాము భయపడి ఆ భూమిపై ఆశలు వదులుకొన్నామని జాన్ రాంకుమార్ భార్య శ్రీదేవి తెలిపారు.
పాత పాల్వంచలో స్పాంజ్ ఐరన్ కంపెనీలో పనిచేస్తున్న చెర్ల చిట్టయ్య అనే ఓ కార్మికనేత (1993) హత్య కేసులో కూడా వనమా రాఘవ ఆరోపణలు ఎదుర్కొన్నాడు కానీ సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
పాల్వంచ పట్టణంలో వికలాంగుల కాలనీకి చెందిన మల్లిపెద్ది వేంకటేశ్వరరావు గత ఏడాది ఓ చిట్టీల వ్యాపారి చేతిలో మోసపోయాడు. అప్పుడు తన భర్త వనమా రాఘవను ఆశ్రయిస్తే రూ.10 లక్షలు తీసుకొని తమను మోసం చేశాడని, పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు తన భర్తనే అరెస్ట్ చేసి జైలుకి పంపారని వెంకటేశ్వరరావు భార్య శ్రావణి తెలిపారు. డబ్బు, పరువు రెండూ పోగొట్టుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తన భర్త గత ఏడాది జూలై 29వ తేదీన పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నారని ఆమె తెలిపారు. తన భర్త కూడా సూసైడ్ నోట్లో తన చావుకు వనమ రాఘవతో పాటు కారకులైన 42 మంది పేర్లను వ్రాసారని ఆమె తెలిపారు. పోలీసులు వనమా రాఘవపై కేసు నమోదు చేశారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు శ్రావణి తెలిపారు.
వనమా రాఘవను మొదట్లోనే పోలీసులు కట్టడి చేసి ఉండి ఉంటే ఇన్ని కుటుంబాలు చితికిపోయి ఉండేవి కావని ఇటీవల ఆత్మహత్య చేసుకొన్న నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పిన విషయం అందరికీ తెలుసు. కనుక ఇప్పటికైనా పోలీసులు వనమా రాఘవను బలమైన సాక్ష్యాధారాలతో నేరస్థుడిగా నిరూపించవలసి ఉంటుంది లేకుంటే అతని అకృత్యాలకు మరింత మంది బలైపోయే ప్రమాదం ఉంటుంది.