
ఏపీ ప్రభుత్వోద్యోగుల వేతన సవరణ డిమాండ్స్‌పై చర్చించేందుకు ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిఎం జగన్ తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగుల జీతభత్యాలు, తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాల గురించి మాట్లాడటం విశేషం.
“తెలంగాణ రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే మన ఏపీ ఆదాయం చాలా తక్కువ. అలాగే తెలంగాణ సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా మన ఏపీలో రూ.1,70,215 మాత్రమే ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలకు రూ. 17,000 కోట్లు, పెన్షన్లకు రూ. 5,603 కోట్లు కలిపి రూ. 22,608 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇది గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలలకు కాగ్ నివేదిక ప్రకారం లెక్కలు.
కానీ అదే సమయానికి మన ఏపీలో కేవలం జీతాలకే రూ.24,681.47 కోట్లు ఖర్చు చేశాము. పెన్షన్లకు మరో రూ. 11,324 కోట్లు కలిపి మొత్తం రూ.36,000 కోట్లు ఖర్చయింది. అంటే మనకంటే ఆర్ధికంగా చాలా బలంగా ఉన్న తెలంగాణ కంటే రూ.13,392 కోట్లు అదనంగా ఖర్చు చేశాము.
తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నానాటికీ పెరుగుతోంది కానీ రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడంతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా ఏపీ ప్రభుత్వ ఆదాయం ఇంకా తగ్గింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వలన ప్రభుత్వంపై రూ.5,380 కోట్ల అదనపు భారం పడింది....” అంటూ ఏపీ సిఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించి, తెలంగాణతో పోల్చుకోవద్దని, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లు తమకూ వేతన సవరణ ఇవ్వాలని పట్టుబట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రెండు మూడు రోజులలో అందరికీ ఆమోదయోగ్యమైన పీఆర్సీని ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం 14.29 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిద్దపడగా, ఉద్యోగ సంఘాలు కనీసం 27 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.