13.jpg)
బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మొన్న హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు. వాటిని టిఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జేపీ నడ్డాపై నిప్పులు చెరిగారు.
“ఓ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా తన స్థాయిని మరిచి చాలా నీచంగా మాట్లాడారు. నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతూ సిఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు. ఈ ఏడేళ్ళలో కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమీ లేదు కానీ ఇలా చీటికి మాటికి ఎవరో ఒకరు ఢిల్లీ నుంచి బెదిరించడం పరిపాటిగా మారిపోయింది. అయితే మీ తాటాకు చప్పుళ్ళకు మేము భయపడబోము.
రైతులు, ఉద్యోగుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. మోడీ ప్రభుత్వమే రైతు వ్యతిరేక, ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం. ప్రధాని నరేంద్రమోడీ నిన్న పంజాబ్ పర్యటనకు వెళితే అక్కడ రైతులు అడ్డుకొని నిరసనలు తెలపడంతో ఢిల్లీ వెనుతిరిగి వెళ్లారు. ఇంతవరకు ఏ ప్రధానికి ఇటువంటి దుస్థితి ఎదురవలేదు. కేంద్రమంత్రి కుమారుడు ధర్నా చేస్తున్న రైతులను తన కారుతో తొక్కించి చంపితే ఇంతవరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ ఏడేళ్ళలో కేంద్రప్రభుత్వం తన ఉద్యోగులకు కేవలం 15 శాతం వేతనాలు పెంచితే మా ప్రభుత్వం 85 శాతం పెంచింది. కేంద్రప్రభుత్వం వరుసగా ఒక్కో సంస్థను మూసివేస్తూ దానిలో పనిచేస్తున్నవారిని రోడ్డున పడేస్తుంటే మేము మా ఉద్యోగులను కడుపులో పెట్టుకొని కాపాడుకొంటున్నాము. కొత్త జోనల్ విధానం తీసుకువచ్చి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాం. జీవో317 గురించి బిజెపి నేతలకు అసలు ఏమీ తెలీదు. కేవలం రాజకీయ లబ్ది కోసమే దొంగ దీక్షలు చేస్తున్నారు.
కుటుంబ పాలన గురించి మాట్లాడిన జేపీ నడ్డాకు తన అత్త జయశ్రీ బెనర్జీ ఎంపీగా, మంత్రిగా పనిచేసిన సంగతి మరిచిపోయారా? కేంద్రహోంమంత్రి అమిత్ షా కుమారుడు బీసీసీఐ పదవి ఇచ్చిన సంగతి మరిచిపోయారా? బిజెపీ నేతల వారసులు పార్టీలో పదవులలో లేరా?
ఈ ఏడేళ్ళలో మోడీ ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు. హైదరాబాద్‌లో కంటోన్‌మెంట్ రోడ్డు మొదలుకొని ధాన్యం కొనుగోలు వరకు ప్రతీచోట మోడీ ప్రభుత్వం కొర్రీలే వేసింది తప్ప రాష్ట్రానికి ఏమాత్రం సాయపడలేదు. పైగా నిత్యం ఈవిదంగా బెదిరింపులు...ఆరోపణలు చేస్తుంటారు. మీ తాటాకు చప్పుళ్ళకు మేము భయపడబోము. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగిస్తుంది,” అని కేటీఆర్ హెచ్చరించారు.