పంజాబ్‌లో ఫ్లైఓవర్‌పై నిలిచిపోయిన ప్రధాని కాన్వాయ్‌

ప్రధాని నరేంద్రమోడీకి ఈరోజు పంజాబ్ పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఈరోజు ఉదయం ప్రధాని నరేంద్రమోడీ భటిండా విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పూర్ వెళ్లవలసి ఉంది. కానీ వాతావరణం అనుకూలించని కారణంగా భటిండా నుంచి రోడ్డు మార్గంలో ఫిరోజ్‌పూర్‌కు బయలుదేరగా దారిలో ఓ ఫ్లైఓవర్‌ వద్ద నిరసనకారులు ఆందోళన చేస్తుండటంతో పీఎం కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై సుమారు 15-20 నిమిషాలసేపు నిలిచిపోయింది. అదే మార్గంలో సాధారణ వాహనాలు కూడా తిరుగుతుండటంతో స్పెషల్ ప్రొటెక్షన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రధాని కారు చుట్టూ రక్షణగా నిలబడ్డారు. కానీ 20 నిమిషాలు గడిచినా స్థానిక పోలీసులు ప్రధాని కాన్వాయ్‌కి దారి కల్పించలేకపోవడంతో భద్రతాధికారుల సూచన మేరకు ప్రధాని నరేంద్రమోడీ ఫిరోజ్‌పూర్‌ పర్యటన రద్దు చేసుకొని వెనుతిరిగారు. భటిండా విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ తిరిగి వెళ్ళిపోయారు. 

దీనిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “నేను ప్రాణాలతో భటిండా విమానాశ్రయానికి ప్రాణాలతో తిరిగి చేరుకోనందుకు మీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలపండి,” అని ట్వీట్ చేశారు. 

ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కూడా తీవ్రంగా స్పందించింది. ప్రధాని నరేంద్రమోడీ పర్యటనకు వస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రయాణించే మార్గంలో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించి కాన్వాయ్ సజావుగా సాగేందుకు తోడ్పడి ఉండాలి. కానీ అటువంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదని స్పష్టమైంది. దీనిని భద్రతా వైఫల్యంగానే పరిగణిస్తున్నాము,” అని ప్రకటించింది. దీనిపై పంజాబ్ హోంశాఖను, డీజీపీని కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. 

అయితే ప్రధాని పర్యటనలో ఎటువంటి భద్రతా వైఫల్యం జరుగలేదని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ చన్నీ అన్నారు. హెలికాప్టర్‌లో వెళ్ళవలసిన ప్రధాని నరేంద్రమోడీ చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో బయలుదేరడం వలననే ఈవిదంగా జరిగిందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రధాని పర్యటనకు ఆటంకం కలగడం తనకు చాలా బాధ కలిగించిందని, దీనిపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకొంటామని అన్నారు.  

త్వరలో పంజాబ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈసమయంలో ఈ ఘటన జరుగడంతో బిజెపికి, అధికార కాంగ్రెస్ పార్టీకి మద్య ఈ ఘటనపై అప్పుడే మాటల యుద్ధం మొదలైంది.