బండికి బెయిల్‌..పోలీసులకు మొట్టికాయలు

కరోనా ఆంక్షలు ఉల్లంఘించి జాగరణ దీక్ష చేసినందుకు అరెస్ట్ చేసి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండులో ఉన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌కి హైకోర్టు ఈరోజు రూ.40 వేలు సొంత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేసింది. కరీంనగర్‌ మేజిస్ట్రేట్ కోర్టు విధించిన జ్యూడీషియల్ రిమాండ్‌పై స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది.  

బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించినందుకు మొట్టికాయలు వేస్తూ వారికీ, ప్రభుత్వానికి కొన్ని సూటి ప్రశ్నలు వేసింది. 

• రాత్రి 10.50 గంటలకు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి 11.15 గంటలకు అంటే 25 నిమిషాలలోపే పోలీస్‌స్టేషన్‌కు తరలించి, ఎఫ్ఐఆర్ కూడా ఏవిదంగా నమోదు చేయగలిగారు? 

• బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు 11 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కానీ ఆ వివరాలు రిమాండ్ రిపోర్టులో ఎందుకు పేర్కొనలేదు? 

• ఎఫ్ఐఆర్‌లో సెక్షన్ 333 (విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని గాయపరచడం) ఎందుకు చేర్చారు? 

కోవిడ్ ఆంక్షలు ఉల్లంఘిస్తే 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించడం దేనికి?