నేటి మంత్రివర్గ సమావేశం చాలా కీలకమైనది..ఎందుకంటే..

ఈరోజు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగబోతోంది. దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశంలోనే కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకొంటారు. ప్రతిపాదిత కొత్త జిల్లాల ఏర్పాటుకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం లాంచన ప్రాయమేనని తేలిపోయింది కనుక ఆ తరువాత దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో కొత్తగా 4 పోలీస్ కమీషనరేట్ల ఏర్పాటుపై కూడా ఈ సమావేశంలోనే చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అలాగే బీసి కమీషన్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చాలా కాలంగా చెపుతున్నారు. చాలా కీలకమైన ఆ ప్రతిపాదనకి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 

ఇటీవల కురిసిన బారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు ముంపుకి గురైన సంగతి తెలిసిందే. నగరంలో నుంచి నీళ్ళు బయటకి వెళ్ళవలసిన నాలాలు కబ్జాకి గురవడం వలనే ఆ దుస్థితి ఏర్పడిందని  గ్రహించిన ప్రభుత్వం, యుద్ద ప్రాతిపదికన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే జి.హెచ్.ఎం.సి. అధికారులు సుమారు వెయ్యికి పైగా అక్రమాకట్టడాలని కూల్చి వేశారు. ఇంకా చాలా కూల్చి వేయవలసి ఉంది. కానీ వాటిని నిర్మించుకొన్నవారిలో చాలా మంది న్యాయస్థానాలని ఆశ్రయిస్తుండటంతో కూల్చివేతలకి బ్రేక్ పడింది. 

ఈ కూల్చివేతలు, కోర్టు సమస్యలని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా మున్సిపల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిపై కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కనుక హైదరాబాద్ నగరంతో సహా యావత్ రాష్ట్రంపై ప్రభావం చూపబోయే అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నందున ఈరోజు మంత్రివర్గ సమావేశం చాలా కీలకమైనదని చెప్పవచ్చు.