చివరి నిమిషంలో బీజేపీ ర్యాలీ రద్దు

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి జైలుకి పంపడాన్ని బిజెపి అధిష్టానం చాలా తీవ్రంగా పరిగణించింది. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈరోజు మధ్యాహ్నం కరీంనగర్‌ సబ్ జైలులో ఉన్న బండి సంజయ్‌ను పరామర్శించి వచ్చారు. అనంతరం టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. 

ఈరోజు సాయంత్రం బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌లో నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు రావడం గమనిస్తే బండి సంజయ్‌ అరెస్టును బిజెపి ఎంత సీరియస్‌గా తీసుకొందో అర్ధం అవుతుంది. అయితే కోవిడ్ ఆంక్షల కారణంగా జేపీ నడ్డా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ కోవిడ్ నిబందనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి నేతలు పట్టుపట్టడంతో పోలీసులకు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. 

జేపీ నడ్డా నేతృత్వంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నేతలు విజయశాంతి, డికె.అరుణ, కే.లక్ష్మణ్ తదితరులు సికింద్రాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసారు. కానీ చివరి నిమిషంలో నిరసన ర్యాలీని రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వేలాదిమంది బిజెపి కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సికింద్రాబాద్‌లో ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించక తప్పలేదు. 

బండి సంజయ్‌ అనుమతి లేకపోయినా తన కార్యాలయంలో జాగరణ దీక్ష మొదలుపెట్టినందుకే పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి జైలుకి పంపారు. కానీ ఇప్పుడు పోలీసులు అనుమతించకపోయినా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి నేతలు నగరంలో ఇంత హడావుడి చేసి పోలీసులకు సవాలు విసిరినట్లయింది. కానీ ర్యాలీ రద్దు చేసుకొన్నట్లు బీజేపీ ప్రకటించడంతో అటువంటి ఇబ్బందికర పరిస్థితిని తప్పించినట్లయింది. దీంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకొన్నారు. అయితే జేపీ నడ్డా ర్యాలీ నిర్వహించకపోయినా వేలాదిమంది వెంటరాగా నాంపల్లిలో పార్టీ కార్యాలయానికి చేరుకొన్నారు. మరికొద్ది సేపటిలో జేపీ నడ్డా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.