బండికి బెయిల్‌ నిరాకరణ...14 రోజులు రిమాండ్

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, మరో నలుగురు బిజెపి కార్యకర్తలను నిన్న రాత్రి అరెస్ట్ చేసిన కరీంనగర్‌ పోలీసులు, ఈరోజు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. వారి బెయిల్‌ పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరించి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని జిల్లా సబ్ జైలుకి తరలించారు. బండి సంజయ్‌ తదితరులను న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు పోలీసులు తాజా ఎఫ్ఐఆర్‌తో పాటు గతంలో బండి సంజయ్‌పై నమోదైన 10 కేసులను కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ తరపున వాదించిన న్యాయవాదులు, జైలులో ఆయనకు అందించే ఆహారం ద్వారా విషప్రయోగం జరిగే అవకాశం ఉందని కనుక ప్రతీరోజు వైద్యుల చేత ఆహారం పరీక్షించిన తరువాతే ఇవ్వాలని కోరారు.            

బండి సంజయ్‌ అరెస్ట్ చేయడంపై బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో బిజెపి ఎదుగుదలను చూసి సిఎం కేసీఆర్‌ తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారని అందుకే ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్‌ దీక్షను పోలీసుల చేత భగ్నం చేయించి అరెస్ట్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీస్ కేసులకు, అరెస్టులకు బిజెపిలో ఎవరూ భయపడబోరని జేపీ నడ్డా అన్నారు. సిఎం కేసీఆర్‌ నిరంకుశపాలనకు రోజులు దగ్గర పడ్డాయని, అందుకే ఈవిదంగా వ్యవహరిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బిజెపి కూకటివేళ్ళతో పెకలించి పడేసి అధికారంలోకి వస్తుందని జేపీ నడ్డా అన్నారు.