రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం రాత్రి కరీంనగర్లో పార్టీ కార్యాలయంలో చేయతలపెట్టిన ‘జాగరణ దీక్ష’ను పోలీసులు భగ్నం చేసారు. ఆయన పార్టీ కార్యాలయానికి తాళం వేసుకొని లోపల దీక్ష చేస్తుండటంతో పోలీసులు తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించి ఆయనను, అడ్డుపడిన బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా వారికీ పోలీసులకు మద్య తీవ్ర చాలాసేపు తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు మొదట వారిని మానకొండూరు పోలీస్‌స్టేషన్‌కు, మళ్ళీ అక్కడి నుంచి కరీంనగర్‌లోని పోలీస్ శిక్షణాకేంద్రానికి తరలించారు. బండి సంజయ్ అక్కడే ఈరోజు ఉదయం వరకు దీక్ష చేశారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలని కోరుతూ బండి సంజయ్ కరీంనగర్ పార్టీ కార్యాలయంలో ‘జాగరణ దీక్ష’ చేస్తామని ప్రకటించడంతో, దానికి అనుమతి లేదంటూ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వైరస్లు వ్యాప్తి చెందుతున్నందున ఎటువంటి రాజకీయ సభలు, సమావేశాలు, దీక్షలు, ర్యాలీలకు అనుమతి లేదని కనుక జాగరణ దీక్ష నిర్వహించవద్దని ఆదివారం ఉదయమే పోలీసులు కరీంనగర్‌లోని బిజెపి నేతలకు చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితులలో జాగరణ దీక్ష చేస్తామని వారు చెప్పడంతో నిన్న మధ్యాహ్నం నుంచే జిల్లా బిజెపి అధ్యక్షుడితో పాటు పలువురు జిల్లా బిజెపి నేతలను పోలీసులు అదుపులో తీసుకొన్నారు. దీంతో కరీంనగర్ పట్టణంలో నిన్న ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయడాన్ని బండి సంజయ్, రాష్ట్ర బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు.