హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈవిషయం ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఈ కొత్త సంవత్సరంలో నగరంలో పాత, కొత్త ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన షేక్‌పేట్ ఫ్లైఓవర్‌ను నేడు ప్రారంభించుకోబోతున్నాము,” అని తెలియజేస్తూ దానికి సంబందించిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
షేక్‌పేట్ ఫ్లైఓవర్ వివరాలు: రూ.333.55 కోట్లు వ్యయంతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ నగరంలో టోలీచౌకీ-రాయదుర్గంలను కలుపుతుంది. నగరంలో ఇప్పటివరకు నిర్మించిన ఫ్లైఓవర్లలలోకెల్లా ఇదే పొడవైనది. దీని పొడవు 2.71 కిమీ వెడల్పు 12 మీటర్లు. ఆరు లేన్లతో రెండు వైపులా వాహనాలు వెళ్ళేందుకు (టూవే) వీలుగా దీనిని నిర్మించారు.
ఇది నగరంలో టోలీచౌకీ వద్ద (గెలాక్సీ థియేటర్) వద్ద ప్రారంభమై శేరిలింగంపల్లి మల్కం చెరువు వద్ద ముగుస్తుంది. నగరంలోని నాలుగు ప్రధాన చౌరస్తాలైన సెవెన్ టోంబ్స్, ఫిల్మ్ నగర్, ఓయూ కాలనీ, విష్పర్ వ్యాలీ మీదుగా ఇది సాగుతుంది. ఈ నాలుగు జంక్షన్‌లలో రోజుకి సుమారు 4 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. కనుక అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉండే ఈ ప్రాంతాలలో ప్రవేశించకుండానే ఈ ఫ్లైఓవర్ మీదుగా హాయిగా సాగిపోవచ్చు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, ఐటి హబ్, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఫ్లైఓవర్‌తో చాలా ఉపశమనం లభిస్తుంది.