న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మళ్ళీ కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నందున ఈరోజు రాత్రి హైదరాబాద్‌లో న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌పై ముంబై, ఢిల్లీ నగరాలలోగా కటినమైన ఆంక్షలు విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ వేర్వేరుగా మార్గదర్శకాలు, ఆంక్షలు ప్రకటించాయని హైకోర్టు పేర్కొంది. రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ పరిస్థితులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని భావిస్తున్నామని కనుక ఈ దశలో న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలుచేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను, నియమ నిబందనలను కూడా వేడుకలలో ఖచ్చితంగా అమలుచేయాలని హైకోర్టు సూచించింది. ఈ ఆంక్షలను, మార్గదర్శకాలను ఉల్లంఘించినవారిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొందో జనవరి 4న జరిగే తదుపరి విచారణలో తెలియజేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌పై హైకోర్టు ఆంక్షలు విధించేందుకు లేదా స్టే ఇచ్చేందుకు నిరాకరించడమంటే వేడుకలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లే. కనుక అందరూ హ్యాపీగా న్యూఇయర్ సెలెబ్రేషన్స్‌లో పాల్గొనవచ్చు. అయితే మద్యం తాగి వాహనాలు నడిపినా, వేడుకల సందర్భంగా మాదకద్రవ్యాలు తీసుకొని పోలీసులకు పట్టుబడినా కొత్త సంవత్సం జైల్లో ప్రారంభించవలసి ఉంటుందని మరిచిపోకూడదు.