
గత శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌కు కాంగ్రెస్ కూటమి మాత్రమే ప్రత్యర్ధిగా నిలిచింది. కానీ 2023లో జరుగబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌తో పాటు బిజెపి, వైఎస్సార్‌టిపి, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బిజెపి చాలా నమ్మకంగా ఉంది. రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఇదే చివరి అవకాశం లేకుంటే 2028 ఎన్నికల నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనబడకపోవచ్చు కనుక టిఆర్ఎస్, బిజెపిలకు గట్టి పోటీ ఇస్తుంది. ‘వచ్చే ఎన్నికలలో గెలిచి తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాము రాసి పెట్టుకోండని’ వైఎస్ షర్మిల చెపుతున్నారు. వచ్చే ఎన్నికలలో గెలిచి ఏనుగుపై ప్రగతి భవన్‌లో ప్రవేశిద్దామని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ప్రవీణ్ కుమార్ చెపుతున్నారు. చెప్పడమే కాదు... జనవరి 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేసి పార్టీని బలోపేతం చేసుకొంటామని, ‘మన ఓటు మనకే’ అనే నినాదంతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను బీఎస్పీవైపు మళ్ళిస్తామని ప్రవీణ్ కుమార్ చెపుతున్నారు. మొదట జనగామ జిల్లా, రఘునాథపల్లి మండలంలోని సర్దార్ పాపన్నగౌడ్ పుట్టిన ఖిలాషాపూర్ గ్రామం నుంచి ప్రవీణ్ కుమార్ యాత్ర ప్రారంభించబోతున్నారు.
రెండు దశలలో ఏడాదిపాటు సాగే ఈ యాత్ర ముగిసిన తరువాత హైదరాబాద్‌లో 10 లక్షల మంది బడుగు బలహీనవర్గాలతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తమపార్టీ సత్తా చాటిచూపుతామని బీఎస్పీ చెపుతోంది. జనవరి 15లోగా రెండు లక్షల మంది పార్టీ సభ్యత్వం సాధించేందుకుగాను ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 2,000 మందిని పార్టీ కార్యకర్తలుగా చేర్చుకోవాలని లక్ష్యంగా బీఎస్పీ నిర్ణయించుకొంది. కనుక 2023 ఎన్నికలలో టిఆర్ఎస్ వీటన్నిటినీ ఎదుర్కొని గెలిచి అధికారం నిలబెట్టుకోవలసి ఉంటుంది.