
బియ్యం కొనుగోలుపై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ప్రతిష్టంభన ఏర్పడటం అది టిఆర్ఎస్-బిజెపిల మద్య రాజకీయ యుద్ధంగా మారడం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నానాటికీ ఒత్తిడి పెంచుతుండటంతో కేంద్రప్రభుత్వం ఒప్పందం ప్రకారం తీసుకోవలసిన 40 లక్షల టన్నులకు అదనంగా మరో 6 లక్షల టన్నుల బియ్యం తీసుకొనేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ అండర్ సెక్రటరీ జై ప్రకాశ్ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేశారు.
ఇటీవల రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి రాష్ట్రం నుండి కేంద్రం ఎంత బియ్యం కొనుగోలు చేస్తుందో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఒత్తిడి చేశారు. వారు కోరినట్లుగా కేంద్రం లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ ఖరీఫ్ సీజనులో తెలంగాణ రాష్ట్రంలో పండిన మొత్తం బియ్యం కేంద్రమే తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం పట్టుబడుతోంది. కానీ 46 లక్షల టన్నులు రారైస్ మాత్రమే తీసుకొంటోంది. కనుక టిఆర్ఎస్ స్పందన ఏవిదంగా ఉంటుందో ఊహించవచ్చు.