
వచ్చే యాసంగి సీజను సాగు కోసం తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి రైతుల ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమా చేయనుంది. దీని కోసం ప్రభుత్వం రూ.7,600 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో 66.61 లక్షల మంది రైతులు లబ్ది పొందుతారు.
ముందుగా ఒక ఎకరం లేదా అంత కంటే తక్కువ భూమి ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలలో నేడు రైతు బంధు సొమ్ము జమా చేస్తారు. రేపటి నుంచి వరుసగా 1-2 ఎకరాలు, 2-3 ఎకరాలున్నవారి ఖాతాలలో రైతుబంధు సొమ్ము జమా చేస్తారు. నేటి నుంచి పది రోజులలోగా రాష్ట్రంలో అర్హులైన రైతులందరికి రైతు బంధు పంపిణీ కార్యక్రమం పూర్తి చేయబోతున్నారు. రైతు ఖాతాలో రైతు బంధు సొమ్ము జమా చేయగానే వ్యవసాయశాఖ సదరు రైతుకి ఈ విషయం తెలియజేస్తూ వారి మొబైల్ ఫోన్‌కి సంక్షిప్త సందేశం పంపిస్తుంది.
గత ఏడాది జూన్ నుంచి ఈ నెల 10 వరకు రాష్ట్రంలో కొత్తగా సుమారు 20 వేల మంది వ్యవసాయ భూములు కొన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ నెలాఖరులోగా వారందరి వివరాలు కూడా రెవెన్యూ రికార్డులలో నమోదుచేసి వారికి కూడా రైతు బంధు నిధులు అందించబోతున్నారు.