రేవంత్‌ రెడ్డి గృహ నిర్బందం

సిద్ధిపేట జిల్లా ఎర్రవెల్లిలో ఇవాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ప్రకటించడంతో పోలీసులు ఆయనను గృహనిర్బందంలో ఉంచారు. ఈరోజు ఉదయమే పోలీసులు జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి చేరుకొని బయటకు రాకుండా ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరూ అక్కడికి చేరుకోకుండా చుట్టుపక్కల ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించారు. 

రేవంత్‌ రెడ్డి తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “ఎర్రవెల్లిలో మేమేమీ కేసీఆర్‌ ఫాంహౌస్ ముట్టడించడానికి వెళ్ళడం లేదు కదా?ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారితో మాట్లాడేందుకు ఈ కార్యక్రమం పెట్టుకొన్నాము. మేము రైతులను కలిస్తే మీకెందుకు భయం, అభ్యంతరం?ఎర్రవెల్లి ఏదో నిషేదిత ప్రాంతం అన్నట్లు నన్ను అడ్డుకొంటున్నారు. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా మేము ఎర్రవెల్లిలో రైతులతో రచ్చబండ నిర్వహిచి తీరుతాము. ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ కలిసే డ్రామాలు ఆడుతూ రైతులను మభ్యపెడుతున్నాయి. టిఆర్ఎస్‌ మంత్రులు ఢిల్లీకి వెళ్ళి హడావుడి చేసి వస్తే, బండి సంజయ్‌ హైదరాబాద్‌లో దీక్ష పేరుతో డ్రామా చేస్తున్నారు,” అని టిఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.