ఇంకా ఢిల్లీలోనే రాష్ట్ర మంత్రులు...కేంద్రంపై ఆగ్రహం

ధాన్యం కొనుగోలు విషయం గురించి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో మాట్లాడేందుకు వారం రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఆయన నుంచి సమాధానం రాకపోవడంతో ఇంకా అక్కడే వేచి చూస్తున్నారు. ఒప్పందం ప్రకారం రాష్ట్రం నుంచి కేంద్రప్రభుత్వం 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. కానీ ఇంకా మిగిలిన ధాన్యాన్ని కూడా కేంద్రమే కొనుగోలు చేస్తామని తెలియజేస్తూ కేంద్రమంత్రి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు ఢిల్లీ నుంచి వెనక్కు వెళ్లబోమని చెప్పారు. 

వారు ఢిల్లీకి రాగానే కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వారికి అపాయింట్మెంట్ ఇచ్చి కేంద్రం వైఖరిని మళ్ళీ మరోసారి చెప్పారు. అదనపు ధాన్యం కొనుగోలుపై రెండు రోజులలో సమాధానం చెపుతానన్నారు. కానీ వారం రోజులైనా జవాబు చెప్పకపోవడంతో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వారు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన మేము వారం రోజులుగా ఇక్కడ కేంద్రం సమాధానం కోసం ఎదురు చూస్తున్నాము కానీ స్పందన లేదు. ఇది మా రాష్ట్రాన్ని, మా ప్రజలను అవమానించడంగానే భావిస్తున్నాము. వర్షాకాలంలో పండిన ధాన్యం మొత్తం కేంద్రప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, కిషన్‌రెడ్డి పదేపదే చెప్పారు. కానీ ఆ మిగులు ధాన్యం తీసుకొంటుందా లేదా చెప్పమంటే చెప్పడం లేదు. ఇకనైనా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి లేకుంటే ఆ ధాన్యం అంతా ఢిల్లీకి తెచ్చి ఇండియా గేట్ ముందు పారబోస్తాము,” అని హెచ్చరించారు.