
హైదరాబాద్‌లో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన అనుచరులు, విద్యార్ధులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సుమారు 4.50 లక్షల మంది విద్యార్దులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాస్తే వారిలో 2.35 లక్షల మంది ఫెయిల్ అయినట్లు బోర్డు ప్రకటించింది. ఫెయిల్ అయిన విద్యార్దులందరూ ప్రభుత్వ కాలేజీలలో చదువుకొనేవారే. వారిలో చాలామంది నిరుపేదలు...గ్రామీణ ప్రాంతాలలో నివశిస్తున్నవారే. వారి వద్ద ల్యాప్‌టాప్‌లు ఉండవు. చాలా మంది వద్ద కనీసం మొబైల్ ఫోన్స్ కూడా ఉండవు. మరి వారు ఆన్‌లైన్‌లో పాఠాలు ఎలా చదువుకోగలరు?కరోనా కారణంగా అనేక రాష్ట్రాలు విద్యార్దులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేశాయి. మరి మన ఇంటర్ బోర్డ్ విద్యార్దుల జీవితాలతో ఎందుకు చెలగాటం ఆడుతోంది?పరీక్షలలో ఫెయిల్ అయ్యమనే మనస్తాపంతో ఇప్పటికే ఒకరిద్దరు విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కనుక విద్యార్దుల సమస్యలను, వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డ్ వారికి కనీసం మార్కులు కేటాయించి పాస్ చేయాలి. విద్యార్దులు బెటర్‌మెంట్ పరీక్షలు వ్రాసుకొనేందుకు కూడా అవకాశం ఇవ్వాలి,” అని డిమాండ్ చేశారు.