2.jpg)
ధాన్యం కొనుగోలుపై టిఆర్ఎస్, బిజెపిలు డ్రామాలు ఆడుతూ కాలక్షేపం చేస్తుంటే మద్యలో వరి రైతులు నష్టపోతున్నారని, ఇప్పటికే కొందరు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారని, అయినా రెండు పార్టీలకు చీమ కుట్టినట్లైనా లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించి వచ్చేసిన టిఆర్ఎస్ ఎంపీలు మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. గల్లీలో ఆడుతున్న డ్రామాలు చాలావన్నట్లు రెండు పార్టీలు ఢిల్లీలో కూడా డ్రామాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రం పరువు గంగలో కలిపేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రహోంమంత్రి అమిత్ షా డైరెక్షన్లో టిఆర్ఎస్, బిజెపిలు ఈ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయకపోతే రాష్ట్ర కాంగ్రెస్ అధ్వర్యంలో జరుగబోయే ‘రైతులతో రచ్చబండ’ కార్యక్రమంలో రెండు పార్టీల డ్రామాలను బట్టబయలు చేస్తామని రేవంత్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.