రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం

హైదరాబాద్‌ రీజినల్ రింగ్‌ రోడ్డు (హెచ్ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తుఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి, భువనగిరి మీదుగా చౌటుప్పల్‌ను కలుపుతూ రూ.7,512 కోట్లు వ్యయంతో 158.465 కిమీ పొడవునా నిర్మించబోయే ఈ హెచ్ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌కు కేంద్ర జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చిన్న సవరణతో ఆమోదముద్ర వేసింది. కనుక మరో నెల రోజులలోగా దీని కోసం భూసేకరణ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది.. 

నాలుగు జిల్లాలు, 15 మండలాల గుండా సాగే ఈ హెచ్ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం మొత్తం 120 గ్రామాల నుంచి సుమారు 4,000 ఎకరాలు భూసేకరణ చేస్తారు. దీనికే సుమారు రూ. 1,800 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు.     

ఈ హెచ్ఆర్‌ఆర్‌ఆర్‌ పరిధిలోకి సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, చౌటకూరు, హట్నూరు, మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్, శివంపేట, తూఫ్రాన్, సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్, యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదాద్రి, భువనగిరి, తుర్కపల్లి,వలిగొండ, చౌటుప్పల్ వస్తాయి. కనుక ఈ మండలాల పరిధిలో గల గ్రామాలలో భూసేకరణ జరుగుతుంది.